ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పట్టణంలోని, పెద్ద కబేలా వీధిలో ఉన్న చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు "ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమంలో భాగంగా శుభ్రత మరియు పరిశుభ్రత పై అవగాహన సదస్సు కార్యక్రమం" అత్యంత ఘనంగా నిర్వహించబడినది. విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అలాగే ఆత్మకూర్ సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఓబులేసు, జీవన్ కుమార్, రఫీక్, మహె జబీన్, రాఘవ, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ మాట్లాడుతూ "పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తన ఇంటిని, పాఠశాలను, వీధిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది అని చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయని, చెత్తను చెత్తబుట్టలో వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ "ఈనాటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలని పరిశుభ్రతను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని ప్రతి విద్యార్థి తన కుటుంబానికి, తన గ్రామానికి పరిశుభ్రత రాయబారిగా మారాలని మనం చేసే చిన్న మార్పు దేశాన్ని గొప్ప మార్పు వైపు నడిపిస్తుందని విద్యార్థులను ఉత్తేజపరిచారు. పాఠశాల కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ ఆత్మకూరు తాజుద్దీన్ మాట్లాడుతూ "విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదని మంచి అలవాట్లు, పరిశుభ్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కూడా విద్యలో భాగమేనని ప్రతి విద్యార్థి తన పాఠశాలనే మాత్రమే కాకుండ తమ ఇంటిని, తమ వీధిని కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుండాలని పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆరోగ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుంది" అని తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్ బేబీ స్వచ్ఛ ఆంధ్ర మరియు స్వచ్ఛ ఆత్మకూరు అని పరిశుభ్రత పై ప్రతిజ్ఞను విద్యార్థులతో మరియు సిబ్బంది మరియు పాఠశాల బృందంతో చేయించినారు. మరియు పరిశుభ్రత సందేశాలతో కూడిన నినాదాలను ఉత్సాహంగా నినదించారు. ఈ ర్యాలీలో పరిసరాల పరిశుభ్రత – ప్రతి ఒక్కరి బాధ్యత, ఒక్కటే మాట – పరిశుభ్రత బాట, పరిసరాలు పరిశుభ్రం – రోగాలకు బహు దూరం, వేయకు చెత్త – చేయకు పాపం, అపరిశుభ్రత నివారిద్దాం – వ్యాధులను నిరోధిద్దాం, పచ్చదనం – పరిశుభ్రత ప్రగతికి సోపానం, ఇంటింటా మరుగుదొడ్డి – ఊరంతా ఆరోగ్యం, చెత్తని రోడ్లపై వేయకండి – డ్రైన్లను చెత్తతో మూసివేయకండి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మరియు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కలిసి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. చెత్తను తొలగించి పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను తడి–పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, మొక్కలు నాటడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న అధికారులు మరియు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించి, పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా తమ ఇంటి నుండి ప్రారంభించి పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రతే ఆరోగ్యానికి, ఆరోగ్యమే అభివృద్ధికి మార్గం అనే సందేశంతో ఈ అవగాహన కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
Admin
E Nivas News