ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : - ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శారదా కళాశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నియమావళి ప్రకారం జరుగుతున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సరైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. మాల్ ప్రాక్టీసులను పూర్తిగా నివారించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్షా నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. పరీక్షలను సజావుగా, నిరాటంకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు 98 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు పరీక్షలు జరుగుతున్నాయి. తనిఖీల్లో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News