ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్క్‌ఫెడ్ సహకారంతో హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలోని వంగపహాడ్, నాగారం గ్రామాలలో పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నాగరాజు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన ధరలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మధ్యవర్తుల ద్వారా రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని, అందుకే రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలుకల్పించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.అనంతరం గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ విద్యార్థుల శిక్షణ తరగతులు జరుగుతుండగా ముఖ్యఅతిథిగా పాఠశాలకు వెళ్లి వారితో సరదాగా గడిపి ఒక మొక్కను నాటి వారికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పాక్స్ ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News