ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వలపుల వల వేసి అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు సోమవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ కు చెందిన ఎం. లక్ష్మీకాంత్ తన వివాహానికి ఆన్లైన్, యుట్యూబ్ లో వివాహ వధువుల కొరకు శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ నందు రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలనని తన ఆస్తులు కోర్టులో చిక్కుకున్నాయని నమ్మబలికింది. లాయర్ కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా వారి వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు పూర్తిగా చూసుకోవాలి అని చెప్పి అతని వద్ద నుండి విడతలవారీగా రూ. 8 లక్షలు మోసం చేసి దండుకున్నారని తెలిపారు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసంలో పడిన బాధితుడు విడతల వారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోయానని గ్రహించి 1930 ద్వారా సైబర్ ఫిర్యాదు చేయగా, ఈనెల 25న ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఆదేశాల మేరకు సైబర్ సెల్, వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లాలో ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుల నుండి ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో wps ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్ ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News