ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమాజంలో మహిళల పాత్ర మరువలేనిదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (స్థానిక సంస్థలు ) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ముందస్తు అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారన్నారు. వంట గదికే పరిమితం కాకుండా అంతరిక్షం వరకు ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా నేడు పలు రకాల రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో మహిళలు తమ ప్రత్యేకత చాటుతున్నారని కొనియాడారు. మహిళలఅభ్యున్నతితోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఒక ఆడపడుచు చదువుకుని ఎదిగితే వారి కుటుంబం మొత్తం బాగుపడుతుందని తెలిపారు. ఎలాంటి ఆత్మనూన్యతకు గురి కాకుండా మహిళ తాము అనుకున్నది సాధించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నూతన మున్సిపల్ పాలక వర్గ సభ్యులను పరిచయం చేసుకున్నారు. పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, మున్సిపల్ కమీషనర్ కు సూచనలు చేశారు. అదే విధంగా స్థానిక గోదావరి వద్ద తహసీల్దార్ తో కలిసి పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్,తహసీల్దార్ దిలీప్ కుమార్,మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు సూరం చంద్రమౌళి, బిరుదుల సత్యనారాయణ,శనిగారపు చిన్నయ్య, బోడ రాజేంద్ర ప్రసాద్, పెట్టెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News