ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్ విన్ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ పొందుతున్న నర్సులతో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం టూరిజం ప్లాజాలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూజర్మనీలో పని చేయడం ఒక పెద్ద అవకాశం మాత్రమే కాదు ఒక ఛాలెంజ్ కూడా అని అన్నారు. కొత్త భాష, కొత్త వాతావరణం, కొత్త విధానాలకు అలవాటు పడాల్సి ఉంటుందని, అయితే కష్టపడి నేర్చుకుంటే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. “నర్సులు రోగులకు ఇచ్చే ధైర్యం, నమ్మకంతోనే సగం వ్యాధి తగ్గిపోతుంది. మీ పాత్ర ఎంతో గొప్పది” అని మంత్రి పేర్కొన్నారు. టామ్‌కామ్ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నామని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని అన్నారు. ఈ బ్యాచ్ జర్మనీలో మంచి ప్రతిభ కనబరిస్తే, భవిష్యత్తులో మరింత మంది తెలంగాణ యువతకు అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, నర్సింగ్ వృత్తి ఎంతో గొప్పదని కొనియాడారు. జర్మన్ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి, డాక్టర్లు సూచించిన మందులను రోగులకు సరిగ్గా అందించేందుకు కమ్యూనికేషన్ చాలా కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా కూడా భాషలను సులభంగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు.తన వ్యాపార అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “నేను కేవలం ఐదు లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను. మద్రాస్‌లో బ్యాంక్ లోన్ కోసం వెళ్లినప్పుడు భాష తెలియక ఇబ్బంది పడ్డాను. అప్పుడు భాష ప్రాధాన్యత నాకు అర్థమైంది” అని తెలిపారు. తమిళనాడులో విజయ్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా ఉపయోగించుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చని చెప్పారు. ప్రతి రోజూ కనీసం గంట సమయం కేటాయించి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనిజర్మన్ పుస్తకాలు చదివే స్థాయికి ఎదగాలని నర్సులకు సూచించారు. టామ్ కామ్ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించిందని వెల్లడించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలు, సీట్ల పెంపుపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ, తాను మొదటిసారి హిందీ భాష నేర్చుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తన తండ్రి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారని, హిందీ సినిమాలు చూస్తూ మెల్లగా భాష నేర్చుకున్నానని చెప్పారు. “మీరు కూడా కొత్త భాష నేర్చుకోవడానికి కష్టపడాలి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ వెంకటస్వామి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. టామ్‌కామ్ టీం మంచి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. “నేను ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అప్పట్లో లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీకు ఉచితంగా నేర్పిస్తోంది. మీరు కమిట్‌మెంట్‌తో జర్మన్ భాష నేర్చుకోవాలి” అని సూచించారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి జర్మన్ భాషలో మాట్లాడే ప్రయత్నం చేయాలని, ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేయాలని సూచించారు. “మనం ఏ భాష నేర్చుకోవాలనుకుంటామో, ఆ భాషలోనే ఆలోచించడం మొదలు పెట్టాలి” అని పేర్కొన్నారు. జర్మన్ సంస్కృతిని కూడా అర్థం చేసుకుని అలవాటు చేసుకోవాలని సూచించారు. టామ్‌కామ్ డైరెక్టర్ కాంతి వేస్లీ మాట్లాడుతూ, టామ్‌కామ్ సంస్థ జర్మనీలోని ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇప్పటివరకు 46 మంది నర్సులు జర్మన్ భాష శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో 15 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయని, ఇప్పటికే 7 మంది జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు. జర్మనీలో ఇప్పటికే నర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారితో మంత్రి ఆన్‌లైన్ ద్వారామాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. నర్సులుఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
Admin
E Nivas News