ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలిపారు . సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరావు తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన గజెల్లి నర్సయ్య తన భూమిలోకి కొందరు అక్రమంగా చొరబడి బోర్ వేశారని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామానికి చెందిన కాసిపాక విజయ్ కుమార్, బెల్లంపల్లి పట్టణం కాంట్రాక్టర్ బస్తీకి చెందిన దాగం చరణ్ తాము తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని పోరాడామని, తమ పేర్లను ఉద్యమకారుల జాబితాలో నమోదు చేయాలని కోరుతూ వేరువేరుగా అర్జీలు సమర్పించారు. భీమిని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్ రార్ తమ తాత ముత్తాతలకు చెందిన షెత్ సింధీ భూములను అన్యాక్రాంతం కాకుండా తమకు వర్తించే విధంగా న్యాయ సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన చునార్కర్ తారాబాయి, చునార్కర్ శ్యాం రావు తాము సంవత్సరాలుగా కాస్తు, కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమికి నూతన పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ వేరువేరుగా అర్జీలుసమర్పించారు. మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన బొద్దుల స్వప్న దివ్యాంగురాలు అయిన తనకు ప్రభుత్వ పథకాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కు చెందిన పోలికోట సుజిత్ నిరుపేద ట్రాన్స్ జెండర్ అయిన తనకు రెండు పడక గదుల ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. డీ మార్కేషన్,జాతీయ రహదారుల విస్తరణలో అవార్డు పెంచాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూముల కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి చర్యలు తీసుకోవాలని, అంత్యోదయ కార్డు మంజూరు కొరకు ఇతర అంశాలపై దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, మంథని ప్రాంత అభివృద్ధిపై విశేష కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం మహనీయుల జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News