ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోను త్వరలోనే ప్రారంభిస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పెద్దపెల్లి కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి జరుగుతున్న బస్సు డిపో పనులను పరిశీలించారు. ముందుగాప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ విజయ రమణారావు స్వాగతం పలికి వారిని సన్మానించారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయరమణ రావు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు.ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. పెద్దపల్లి చిరకాల వాంఛ అయిన బస్ డిపో మంజూరుకు ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు విజయరమణ రావు పట్టువదలకుండా కృషి చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News