ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు,గోదాములకు తొందరగా తరలించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు . బుధవారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా రవాణా శాఖ అధికారి గోపి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ క్రాంతి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్టార్ 1, 2, 3, 4 లకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ గుత్తేదారులతో వరి ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు,గోదాములకు తరలించాలని, సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకరోజులో కనీసం 6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని ఒక రోజులో దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యం తరలిస్తున్న లారీలను అటవీ చెక్ పోస్ట్ ల వద్ద ఆపకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, లారీల డ్రైవర్లు, సిబ్బందికి రైస్ మిల్లుల వద్ద త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ లో నమోదు ప్రక్రియ త్వరగా చేపట్టాలని, కొనుగోలు చేసే సమయంలో తడిసిన ధాన్యాన్ని కేటాయించబడిన రైస్ మిల్లులకు మాత్రమే పంపించాలని, రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకుఅధికారులకు సహకరించాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట మండలం గుల్లకోట, మిట్టపల్లి లలో గల శివ సాయి, శ్రీరామచంద్ర, శ్రీరామ రైస్ మిల్లులను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బ్రహ్మారావు, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి సందర్శించి రైస్ మిల్లు యజమానులకు పలు సూచనలు చేశారు. కేటాయించబడిన వరి ధాన్యం త్వరగా దిగుమతి చేసుకోవాలని, వరి ధాన్యం దిగుమతి విషయంలో ప్రభుత్వ నిబంధనలనుపాటించాలని తెలిపారు. తదనంతరం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గాను గోదాముగా మార్చిన దండేపల్లి మండలం లింగాపూర్ లో గల రామ్ లక్ష్మణ్ డిఫాల్టర్ రైస్ మిల్ ను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయబడి కేటాయించబడిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News