ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం గోదామును దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు,గోదాములకు తరలించాలని, సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. అనంతరం జన్నారం మండలం మొర్రిగూడ, జన్నారం లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం గోదామును మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి సందర్శించి గోదాము నిర్వాహకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. జన్నారం మండలం పొనకల్ గ్రామంలో గల సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం వేసవి సెలవులు అయినందున వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పనులు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో గల ధాన్యం గోదామును లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News