ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని ఎల్.పి.జి. వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా గ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్.పి.జి. వినియోగదారుల బ్యాంకు ఖాతాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయని వినియోగదారులు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయని వినియోగదారులకు రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.ఎల్.పి.జి. రీఫిల్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రేషన్ కార్డుదారులు ఈ-కె వై సి పూర్తి చేయాలి.. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కెవైసి పూర్తి చేయాలని తెలిపారు.జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ప్రతి రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈ-కెవైసి పూర్తి చేయడం తప్పనిసరి అని తెలిపారు.రేషన్ కార్డులో ఉన్న సభ్యుల పారదర్శకతను నిర్ధారించడానికి,నకిలీని నిరోధించడానికి,అర్హత కోల్పోయిన వారిని గుర్తించి రికార్డులను నవీకరించేందుకు ఈ- కెవైసి ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు.ఇప్పటివరకు ఈ-కెవైసి చేయించుకోని రేషన్ కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణాలను సందర్శించి,అక్కడ ఏర్పాటు చేసిన ఇ పి ఓం ఎస్ యంత్రం ద్వారా వెంటనే పూర్తి చేయించుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News