ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ఏర్పరచడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రవాణా శాఖలో ఇప్పటికీకొనసాగుతున్న మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పి, అన్ని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకితీసుకురావాలని సూచించారు. రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆర్‌టీవోకార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకుండా, వెంటనే సొంత భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యవసరమని సీఎం తెలిపారు. ఇందుకోసం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సూచించారు.ఇక శంషాబాద్ సమీపంలో ప్రారంభం కానున్న హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో కూడిన బస్ టెర్మినల్ ఏర్పాటు కోసం స్థలం కేటాయిస్తామని, అందుకు తగిన ప్రణాళికలురూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Admin
E Nivas News