ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో సత్వర చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దండేపల్లి మండలం పెద్ద పేట గ్రామానికి చెందిన అగిడి పవన్ నిర్మించుకున్న ఇంటికి ఇంటి నెంబర్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ కొత్తగూడెం లోని మొదటి వాడకు చెందిన కాలనీవాసులు తమ త్రాగునీటి అవసరాల కొరకు నూతన బోర్ వెల్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన పి. రవీందర్ తనకు గల భూమి రికార్డులలో తక్కువగా చూపుతుందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నేపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వడుగుల శాంత తమ గ్రామంలో బంజరు దొడ్డి ఏర్పాటు కొరకు భూమిని కేటాయించాలని, గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తన దరఖాస్తులు 2018- 19, 2019- 2020 సంవత్సరాలలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా నర్సరీలలో పెంచిన మొక్కలకు సంబంధించి డబ్బులు ఇప్పించాలని కోరారు. భీమారం మండల కేంద్రానికి చెందిన బర్ల చంద్రయ్య తాను గొర్రెల కాపరిని అని, వీధి కుక్కల దాడిలో 6 గొర్రెలు చనిపోగా, 2 గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నేపల్లి మండలం చింతపూడి గ్రామ రైతులు తమ గ్రామంలో గల చిర్రకుంట చెరువును కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, వ్యవసాయ బోర్లు వేయడంతో చెరువు కింద ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని, ఈ విషయంపై విచారించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా యువజన క్రీడా సేవల అధికారి హనుమంత రెడ్డి, జిల్లా విద్యాధికారి యాదయ్య, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ లతో కలిసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మనిషి విజ్ఞానంతో పాటు విలువలతో ఎదగాలని బోధించిన మహనీయుడు అని, యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావాన్ని నాటారని అన్నారు.“లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి" అని చెప్పిన వివేకానంద సందేశం నేటి యువతకు మార్గదర్శకమని తెలిపారు. యువత తమ శక్తిని సమాజ హితానికి వినియోగించి, ఉత్తమమైన మనసు, దృఢ సంకల్పం, సేవా ధృక్పథంతో యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News