ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం,పరిశుభ్రమైన వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు . మంగళవారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ, లక్షెట్టిపేట, దండేపల్లి మండలం కర్ణపేట గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, వసతి, భోజనశాల, వంటశాల, త్రాగునీటి వసతులు,విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, విద్యాబోధన, హాజరు రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి బోధన, వసతులు, భోజన నాణ్యత, వసతిగృహ సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంకలగకుండా చూడాలని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధితఅధికారులకు సూచించారు. పాఠశాలలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, స్కూల్ కాంప్లెక్స్ తదితర పనులను తొందరగా పూర్తి చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సంబంధితఅధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, వసతి గృహాలు, గ్రామాలలో పరిశుభ్రతనుకట్టుదిట్టంగానిర్వహించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనిసూచించారు. త్రాగునీటి పైప్‌లైన్లలో లీకేజీలు లేకుండా చూసి, క్లోరినేషన్ చేసిన సురక్షిత నీటిని ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. హాజీపూర్ మండల కర్ణమామిడి గ్రామపంచాయతీని సందర్శించి గ్రామంలో మురుగు కాలువల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని,వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదంలో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైతే ఆయా కుటుంబాలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సందర్శనలో పాఠశాల పరిసర ప్రాంతాలలో వీధి దీపాలు పనిచేయడం లేదని గుర్తించి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్కమిషనర్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండల పంచాయతీ అధికారి సుమన్, మండల విద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు, సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News